Aakhari premalekha

ప్రియమైన అమ్మకి,

నీ పెద్దకొడుకు రాసే మొదటి ప్రేమ లేఖ… దురదృష్టవశాత్తు ఆఖరిది కూడా.

నువ్వు వెళ్ళాక అన్ని మారిపోతాయి అనుకున్నాను. కానీ ఎం మారలేదు. నీ గురించి అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. నేను, తమ్ముడు, నాన్న ఇంకా రోజుకి మూడు పూటలు తింటూనే ఉన్నాం. నేను ఇంకా లేటుగానే నిద్ర లేస్తున్నాను. టైం కి తినట్లేదు. ఇంకా లాప్టాప్ ఒడిలోనే పెట్టుకుంటున్నాను.

కాకపోతే కొన్ని మారాయి.

నేను పడుకుంటే అందరూ “వేణు” అని పిలిచి లేపుతున్నారు కానీ, ఎవరు ఫ్యాన్ కట్టేసి, నన్ను టార్చర్ చేయట్లేదు. కొంచం ఆ టార్చర్ ని మిస్ అవుతున్నాను అమ్మ.

రోజుకి మూడు పూటలు తింటున్నాం కానీ, ఏమో. ఎవరు సరిగా వండట్లేదు. నువ్ చేసిన చట్నీ తినాలి అని ఉందమ్మా.

నేను రోజు సాయంత్రం బైటకి వెళ్తుంటే ప్రతి 15 నిమిషాలకి ఎవరు కాల్ చేయట్లేదు.

లాప్టాప్ ఒడిలో పెట్టుకోకూడదు అని ఎవరు చెప్పట్లేదు.

నేను చేసే కోతి పనులు చూసి ఎవరు నవ్వడానికి లేరు అని నేను చేయడమే మానేసాను.

నీకు గుర్తుందా… నేను నీకు చెప్పకుండా బెంగుళూరు నుంచి ఇంటికి వచినప్పుడు, నేరుగా పైకి రాకుండా, కింద బెల్ కొట్టేవాడని. ఇప్పుడు అలా కొడితే ఎవరు రారు అని గుర్తొస్తేనే… కొంచెం బాధగా ఉంది.

అయినా ఎం పెద్ద మారిపోయింది ?

ఎప్పుడు పని చేస్తూ తినకుండా ఉండే నాకు ఇప్పుడు ఎవరు పదే పదే ఫోన్ చేసి తినమని తిట్టారు అంతే కదా…

ఇకపై ఎవరు నన్ను సైలెంట్ లో ఉన్న ఫోన్ తీస్కొని, “ఈ ఫోన్ రింగ్ అవ్వట్లేదు ఏంట్రా ?” అని అడగరు అంతే కదా...

నేను ఏదైనా వండాలి అనుకుంటే ముందు నీకు ఫోన్ చేసి, నువ్వు ఎత్తకపోతే చిన్నమ్మకి చేసే వాడ్ని. ఇప్పుడు నేరుగా చిన్నమ్మకె చేయాలి. అంతే కదా.

అంతే కాదు అమ్మ. అంతే కాదు.

ఎప్పుడైనా ఎవరైనా “ఆకలేస్తుంది” అంటే నాకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటాదో తెలిసేది కాదు. ఎందుకంటే నాకు ఆకలి వేసే అవకాశం కూడా నువ్వు ఎప్పుడు నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఆకలేసినా, ఎవర్నీ అడగాలి అనిపించట్లేదు.

రోజు రాత్రి నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు, నేను అరిచినా, ప్రేమగా మాట్లాడిన, నేను ఎలా మాట్లాడినా సరే, తర్వాత రోజు నువ్వు ఫోన్ చేస్తావో లేదో అని నేను భయపడే వాడ్ని కాదు. ఎందుకంటే నువ్వు చేస్తావు అని నాకు తెలుసు. ఇప్పుడు కూడా చెయ్ అమ్మ… నీతో మాట్లాడాలి అనిపిస్తుంది అమ్మ.

మొన్న ఇంటికి ఎవరెవరో వచ్చారు. వాళ్ళు మాకు ఏం అవుతారో మాకు తెలీదు. అడగడానికి నువ్వు కూడా పక్కన లేవు.

రోజు బద్దకం వాళ్ళ మధ్యాహ్నందాకా పడుకునే నేను, ఇప్పుడు నువ్వు లేని ఇంట్లో ఉండాలనే భయంతో పడుకుంటున్నాను.

నువ్వున్నావ్ కదా అని నేను డబ్బులు ఇష్టం వచినట్టు ఖర్చు పెట్టేవాడిని. ఇప్పుడేమో అందరూ నీదే బాధ్యత అది ఇది అంటున్నారు. భయమేస్తుంది అమ్మ.

నిన్ను మిస్ అవుతున్నాను అమ్మ.

నువ్వు చేసే ప్రతి పనిని.

నీ మాటల్ని.

నీ పట్టీల సౌండ్ ని.

నీ కాల్ ని.

“వేణు బాబు” అని నువ్వు నన్ను పిలిచే నీ పిలుపు ని.

నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే అన్నం పెట్టమని అడగడం కోసం నీ చుట్టూ తిరగడాన్ని.

మా చిన్నప్పటి స్టోరీస్ అన్ని నువ్వు గుర్తు చేస్కుంటూ మురిసిపోడాన్ని.

నేను దూలెక్కి బట్టలు కొనుక్కుంటే, నా దూల తీరేదాకా నువ్వు తిట్టడాన్ని.

నీకు నచ్చినది వండేసి, “నీకు ఇష్టం అని చేశాను” అని నువ్వు చెప్పే అబద్ధాల్ని.

అన్నిటిని.

సినిమా అంటేనే అబధం అని తెలుసు, కానీ ఒకసారి సినిమాల్లో లాగ, ఒక నక్షత్రం లాగానో, ఆకాశం లో నో కనపడితే నీకు ఇది చెప్పాలి అని ఉందమ్మా.

ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయికి, సొంతంగా ఒక వ్యాపారం పెట్టి, కొడుకుల్ని చదివిస్తూ, అప్పులు తీరుస్తూ, ఇల్లు కట్టాలి అంటే ధైర్యం కావలి. అది నీకు చాలా ఉంది.

You are the bravest woman I have ever known.

ఈ సినిమాల్లో చూపించే థియరీస్ లో ఎంతో కొంత నిజం ఉంటె, నీ ధైర్యం లో కొంచెం ఈ నీ పిరికి కొడుకు కి ఇవ్వు అమ్మ. నువ్వు లేని ఈ లోకంలో నాకు అది చాలా అవసరం.

నేను ఎక్కడో చదివాను. శివుడికి అమ్మ లేదు అని. అమ్మ ఉండి, తన ముందే చనిపోతే తాను బలహీనుడు అయిపోతాడు అని శివుడికి తెలుసు ఏమో.

మతిమరుపు ని మర్చిపోవాలి అనిపించేలా చేసే ఒక జ్ఞాపకం అమ్మా నువ్వు.

నువ్వు ఉన్నప్పుడు పెద్దగా చెప్పలేదు. ఇప్పుడు చెప్తే నీకు వినపడుతుందో లేదో తెలీదు.

I love you amma ❤️🫂

మళ్లీ పుట్టాలి అని నువ్వు అనుకుంటే, మళ్లీ నాకు అమ్మగానే పుట్టు.

కానీ ఈసారి 5 సంవత్సరాలు లేట్ గా పుట్టి టైం వేస్ట్ చేయను.

మళ్లీ నేను ఏ బట్టలు వేసుకోవాలో నువ్వు సెలెక్ట్ చెయ్.

మళ్లీ అన్నం తినేస్తే chocolates ఇస్తాను అని నన్ను మోసం చెయ్.

మళ్లీ నాకు నాన్న maths నేర్పించేటప్పుడు నాన్న కొడితే వచ్చి నచ్చచెప్పు.

మళ్లీ నన్ను స్కూల్ కి ఎత్తుకొని తీసుకెళ్ళు. మళ్లీ నేను annual day కి డాన్స్ వేస్తాను అని చెప్పి స్టేజి మీద కింద పడి దొల్లుతుంటే, కింద కూర్చొని చప్పట్లు కొట్టు.

మళ్లీ ఒకసారి నేను విసిగిస్తే తిట్టు.

మళ్లీ ఒకసారి నన్ను చదివించి, మనం convocation అప్పుడు తీసుకున్న ఫోటోలు favourites లో add చేస్కో.

మళ్లీ ఒక్కసారి నిన్ను “అమ్మ” అని పిలిచే అవకాశం భాగ్యం ఇవ్వు అమ్మ.

ఇట్లు, నీ “నా కొడుకు కి ఏంట్రా హీరో లా ఉంటాడు”, నీ "ఒరేయ్ నాన్నా !" పిలుపుకి శాశ్వత చిరునామా,

“వేణు బాబు”